రామగుండం, ఆగస్టు 8 (ఇది మన హక్కు): రామగుండం నగర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు నగరంలోని పలు సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రులను నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రుల స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్‌తో పాటు నగర మేయర్ మహంకాళి స్వామి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ నేతృత్వంలో రామగుండం నగరానికి సంబంధించిన పలు సమస్యలపై మంత్రులకు వినతిపత్రం సమర్పించినట్లు మేయర్ తెలిపారు.
రామగుండం వరదల నివారణకు కరకట్ట నిర్మించాలి
గోదావరి నదికి సమీపంలో రామగుండం నగరం ఉన్నందున వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు సింగరేణి సంస్థ ఓబీ మట్టిని వినియోగించి కరకట్ట నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు
గోదావరి పుష్కరాలు ప్రారంభం కావడానికి కొద్ది నెలలు మాత్రమే సమయం ఉన్నందున రామగుండం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని మేయర్ తెలిపారు. ప్రధాన రైల్వే మార్గం ఉన్న ప్రాంతం కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు రామగుండం ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పుష్కరాల ఏర్పాట్ల కోసం ఇప్పటికే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రూ.150 కోట్లతో డీపీఆర్ సమర్పించినట్లు తెలిపారు. త్వరితగతిన నిధులు మంజూరు చేస్తే నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
ఖాళీగా ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టులు భర్తీ చేయాలి
రామగుండం నగర పాలక సంస్థలో సుమారు 30 ఏళ్ల క్రితం 85 మంది రెగ్యులర్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఉండగా ప్రస్తుతం కేవలం 37 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు జనాభా ప్రాతిపదికన పబ్లిక్ హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచాలని కోరారు.
వృద్ధ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు అవకాశం ఇవ్వాలి
వృద్ధులు, అనారోగ్యంతో పని చేయలేని ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అదనపు ఆర్థిక భారం లేకుండా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న సిబ్బందిని యువకులతో భర్తీ చేసే విధానానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
విలీన గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన తాత్కాలిక కార్మికుల్లో కూడా వృద్ధులు ఉన్నందున వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక పారిశుద్ధ్య వాహనాలకు ఆపరేటర్లు కావాలి
రామగుండం నగర పాలక సంస్థ వద్ద ఉన్న ప్రత్యేక పారిశుద్ధ్య వాహనాలను సాధారణ డ్రైవర్లు నడపలేరని తెలిపారు. జేసీబీ, బ్యాక్‌హో లోడర్ వంటి వాహనాల నిర్వహణకు అవసరమైన ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
సింగరేణి, ఎన్టీపీసీ సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులు నగర అభివృద్ధికి వినియోగించాలి
రామగుండం పరిధిలోని సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులను నగర పాలక సంస్థ ఖాతాలో జమ చేసి స్థానిక ప్రజల అభివృద్ధి కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సంస్థలకు భూములు ఇచ్చి, ఉపాధి కోల్పోయి, కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్న రామగుండం ప్రాంత ప్రజలకు ఈ నిధుల ద్వారా ప్రయోజనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణి రివైజ్డ్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేలా ఆదేశాలు
సింగరేణి సంస్థ గత 25 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో పాత మొత్తాన్నే చెల్లిస్తోందని మేయర్ పేర్కొన్నారు. 2015 నుంచి రివైజ్డ్ ట్యాక్స్‌కు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసినప్పటికీ పాత పన్ను మొత్తమే చెల్లిస్తున్నారని తెలిపారు.
సింగరేణి సీఎండీకి తగిన ఆదేశాలు జారీ చేసి రివైజ్డ్ ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల నగర పాలక సంస్థ ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
ఖాళీ భూములకు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయాలి
సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థల వద్ద వేల ఎకరాల ఖాళీ భూములు ఉన్నాయని, వాటికి సంబంధించి వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించేలా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీని పొడిగించాలి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద 26.08.2020 నాటికి రిజిస్ట్రేషన్ పూర్తయిన అనధికారిక ప్లాట్లు, లేఅవుట్లకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు.
కటాఫ్ తేదీ ముగిసి దాదాపు ఆరేళ్లు గడిచినందున ఆ తర్వాత నగరాలు, పట్టణాలు విస్తరించాయని, మధ్యతరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్లాట్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ లేకపోవడంతో భవన నిర్మాణ అనుమతులు రాకపోవడంతో మున్సిపాలిటీలకు భవన నిర్మాణ అనుమతి ఫీజులు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు, నాలా ఫీజులు, ఇతర అభివృద్ధి రుసుముల రూపంలో వచ్చే ఆదాయం నిలిచిపోయిందని తెలిపారు.
కాబట్టి ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీని 26.08.2020 నుంచి ప్రస్తుత సంవత్సరం వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వరదల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో పరిసర ప్రాంతాలు మునిగిపోయాయని తెలిపారు.
అయితే రామగుండం నగర పాలక సంస్థ మూడు నెలల ముందుగానే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం వల్ల నగర పరిధిలో గతంలో మాదిరిగా పెద్దగా వరద ముప్పు ఏర్పడలేదని పేర్కొన్నారు.
భవిష్యత్తులో వరద సమస్యలు తలెత్తకుండా వరద కాలువల నిర్మాణం, నిర్వహణపై సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
33 కేవీ విద్యుత్ లైన్ల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలి
రామగుండం నగరానికి విద్యుత్ సరఫరా చేసే ప్రధాన 33 కేవీ లైన్లు సుమారు 50 ఏళ్ల క్రితం సిమెంట్ పోల్స్‌తో ఏర్పాటు చేశారని మేయర్ తెలిపారు. ప్రస్తుతం ఈ లైన్లు ఎన్టీపీసీ కాంపౌండ్ వాల్ లోపల ఉండటంతో నిర్వహణ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
చెట్లు, పొదలు పెరగడం, లైన్లు మరియు పోల్స్ జీవితకాలం ముగియడం వల్ల చిన్నపాటి వర్షాలు, ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 12 కిలోమీటర్ల మేర ఆధునిక టవర్ లైన్ ఏర్పాటు చేసేలా ట్రాన్స్‌కోకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రులను కోరారు..